సర్కార్ టీవీ న్యూస్ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : రేగొండ రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారులో వచ్చే నెల 5వ తేదీ నుండి జరిగే శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ప్రజల భాగస్వామ్యంతో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లు మరియు సంబంధిత శాఖల అధికారులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాలు జారీ చేశారు.ఆదివారం సాయంత్రం జాతర ప్రాంగణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బుగులోని జాతర తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు, సందర్శకులు స్వామి వారిని దర్శించుకుని వారి మొక్కలు తీర్చుకుంటారన్నారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం వంటి సదుపాయాలను మెరుగుపరచడం అత్యవసరమని పేర్కొన్నారు. జాతర సమయానికి ముందే అన్ని పనులు పూర్తవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రతి రోజు పనుల పురోగతిని సమీక్షించనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రజల సహకారంతో బుగులోని జాతరను రాష్ట్ర స్థాయి వేడుకగా మార్చే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
-----------------------
Reporter