సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : అంతర్జాతీయ తెలుగు మహాసభలలో నాగాలాండ్ గవర్నర్ లా గణేషన్, హై కోర్టు న్యాయమూర్తి ఆకుల వెంకట శేషసాయి చేతుల మీదుగా కొత్తగూడెం కవి రాజేష్ ను సన్మానించారు. తెలుగు భాష గొప్పతనాన్ని.. తెలుగు భాష వైభవాన్ని రాబోయే తరాలకు అందించాలన్న గొప్ప సంకల్పంతో మాస్ట్రో డా గజల్ శ్రీనివాస్ నిర్వహణలో ఆంధ్ర సారస్వత పరిషత్ , చైతన విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 5,6,7 తేదీలలో రాజమహేంద్రవరంలో జరిగిన రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలలో సాహిత్య రంగంలో కనబరుస్తున్న ప్రతిభకు గాను కొత్తగూడెం కవి రాజేష్ ను నాగాలాండ్ గవర్నర్ లా గణేషన్, హైకోర్టు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ప్రశంసా పత్రాన్ని అందజేసి సన్మానించారు. తెలుగు మహాసభల సందర్భంగా మూడు రోజుల పాటు సాగిన కవి సమ్మేళనం కథా పఠనానికి రాజేష్ నిర్వాహకుడి గా వ్యవహరించారు. డా. గజల్ శ్రీనివాస్, రసరాజు వంటి గొప్ప కవులు పాల్గొన్న గజల్ కవి సమ్మేళనంలో రాజేష్ తన గజల్ ను వినిపించి సహ గజల్ కవుల, ప్రేక్షకుల ప్రశంసలను పొందాడు. లక్ష మందికి పైగా సాహితీ ప్రియులు పాల్గొన్న మహాసభలలోని సాహితీ సదస్సులు, కవి సమ్మేళనం, కళా ప్రదర్శనలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇంత గొప్ప తెలుగు మహాసభలలో జిల్లా నుండి పాల్గొని సాహితీ రంగంలో ప్రతిభను కనబరచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మంచి గుర్తింపును తీసుకువస్తున్న రాజేష్ ను జిల్లా కవులు, కళాకారులు, పురప్రముఖులు అభినందనలు తెలిపారు.
-----------------------
Admin