సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ఎన్నికల ప్రచారాలకు తెలంగాణకు వస్తున్న ఆయా పార్టీల నేతలపై అడ్డగోలుగా నోరు పారేసుకుంటున్న తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మీ అయ్య కేసీఆర్ మగాళ్లు అయితే కాంగ్రెస్ ప్రశ్నలకు జవాబులు చెప్పాలని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సవాల్ విసిరారు. షాద్ నగర్ అసెంబ్లీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మంత్రి కేటీఆర్ రెండవ సారి షాద్ నగర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలపై చేసిన అభ్యంతరకర సవాళ్లకు కాంగ్రెస్ గట్టిగా జవాబు ఇచ్చింది. సోమవారం కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిసిసి సభ్యులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, గిరిజన విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ రఘు, సీనియర్ నేత చెంది తిరుపతి రెడ్డి, మహబూబ్ నగర్ పార్లమెంటరీ మాజీ అధ్యక్షులు కే. పురుషోత్తం రెడ్డిలు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ కు చదువుకున్న సంస్కారం, ఇంకిత జ్ఞానం రెండు లేవని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో మగాళ్లు లేరా? అన్న ప్రశ్నకు తాము సమాధానం చెబుతామని అన్నారు. షాద్ నగర్ రోడ్ షో సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తుండగా మసీదు నుండి అజా ప్రార్ధన వస్తే అంకిత జ్ఞానం లేకుండా అలాగే కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటని అదే రాహుల్ గాంధీ రోడ్ షోలో ప్రసంగిస్తున్న సమయంలో అజా ప్రార్ధన వస్తే ఆయన ప్రసంగం ఆపుకున్న మగాడని అన్నారు. టిఆర్ఎస్ గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మగాళ్లయితే ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. దళితున్ని సీఎం చేస్తానన్న మీ తండ్రి కెసిఆర్ మగాడైతే ఎందుకు దళితుడిని ముఖ్యమంత్రి చేయలేదని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు అందరికీ ఎందుకు ఇవ్వలేదనీ మగాళ్లయితే ఇచ్చేవారు కదా? అని ప్రతి జవాబులు విసిరారు. షాద్ నగర్ పట్టణంలో నెలరోజుల కిందటే ఎమ్మెల్యే అంజయ్య ప్రగతి ఆశీర్వాద సభకు వచ్చి 1700కు పైగా బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించామని చెప్పుకున్నా, కేవలం ఇద్దరికీ మాత్రమే తాళాలు ఇచ్చి ఫోటోలు దిగారని మిగతా వారికి ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని, మిగతా వారికి పట్టించుకోకపోవడం పట్ల మీరు మగాళ్ళ అని ఘాటుగా స్పందించారు. మాటికి ముందు కాంగ్రెస్ ఎప్పుడు ముసలి కాలం నాటిది అని అంటున్న కెటిఆర్ మీ తండ్రి కెసిఆర్ ముసలివాడై మూడోసారి ముఖ్యమంత్రి పీఠం కోసం ఎదురుచూడడం లేదా? అని అన్నారు. మీది ముసలిపార్టీ కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీలో మగాళ్లు ఉంటే వెంటనే చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన ఏకైక పార్టీ టిఆర్ఎస్ అని అన్నారు. అధికార మదం, అహంకారంతో విర్రవీగుతున్న కేటీఆర్ కు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షుడు కొంకల్ల చెన్నయ్య, మధురాపురం ఎంపీటీసీ భార్గవ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపిటిసి బాదేపల్లి సిద్ధార్థ, జితేందర్ రెడ్డి, గోవర్ధన్ గౌడ్, అందే మోహన్, అందె శ్రీకాంత్ సయ్యద్ ఖదీర్ తదితరులు ఉన్నారు.
-----------------------
Admin