సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : ప్రజలుకు ఇంటిల్లిపాది ఇష్టపడే దీపావళి పండుగ ఆనందంగా జరుపుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి సూచించారు. పొరపాటున జరిగే కొన్ని తప్పిదాలు తీవ్ర సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉందని గుర్తించాలన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుని దీపావళి పండుగను జరుపుకోవాలని కోరారు. * దీపావళి ఆనందంగా సాగాలంటే... ఈ జాగ్రత్తలు తప్పనిసరి* పిల్లలతోపాటు పెద్దలూ కాటన్ దుస్తులనే ధరించడం మంచిది. ధరించిన దుస్తులపై పడిన నిప్పురవ్వలు మరింత రాజుకొని మంటలు వ్యాపిస్తే వెంటనే ఒంటిపై దుప్పట్లు లేదంటే రగ్గులను కప్పి మంటలను నిరోధించాలి. ముందుగా ఎలాంటి అగ్ని ప్రమాదం సంభవించినా వెంటనే మంటలను అదుపు చేసేందుకు బకెట్‌లతో నిండుగా నీళ్లు పక్కన పెట్టుకోండి. వెంటనే ఫైర్ స్టేషన్ ' పోలీసు స్టేషన్ లకు ఫోన్ చేయాలి. చల్లదనం కోసం ఇంటి ముందు లేదంటే మేడపైన తాటాకులు, గడ్డితో వేసుకున్న రిసార్ట్‌ల వంటి వాటిపై నీళ్లు చల్లి ఉంచుకోవాలి. మీ వాహనాలపై కవర్లు వేసి ఉంచాలి. పండుగ సమయంలో వాహనాలను వీలైనంత వరకూ ఇంటిలోపలే ఉంచేలా చర్యలు తీసుకోవాలి. నిప్పురవ్వలు పడి చిన్నచిన్న గాయాలు ఏర్పడితే సెప్టిక్ కాకుండా నిరోధించేందుకు బర్నాల్, దూది, అయోడిన్, టించర్, డెటాల్ కూడిన ఫస్ట్ ఎయిడ్ కిట్ సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రాధమిక వైద్యం చేసిన ఉపశమనం లభించకపోతే వైద్యుని వద్దకు వెళ్లి పూర్తి చికిత్స చేయించుకోవాలి. పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దలు వెంట ఉండాలి. దగ్గరుండి వారితో కాల్పించడం అత్యంత శ్రేయస్కరం. పిల్లలు టపాకాయలు చూస్తే ఎంతో ఉత్సాహం. ఆ ఉత్సాహంలో జాగ్రత్తలు మరిచిపోతారు. కనుక ప్రతి టపాకాయను ఎలా పేల్చాలో వారికి తెలియజేయాలి. టపాసులు కాల్చే ప్రదేశం సరైనదై ఉండాలి. రోడ్డు మధ్యలో లేదంటే ఇంటిలోపల, గుంపులుగా ఉన్న చోట కాల్చవద్దని పిల్లలకు తెలియజెప్పాలి. పెద్ద శబ్ధాలు వచ్చే టపాసులు ఎవరు కాల్చినా పసిబిడ్డలు, పిల్లల చెవుల్లో దూదిపెట్టండి. లేతగా ఉండే వారి కర్ణభేరి చిన్న చిన్న శబ్ధ్దాలకు సైతం ఎక్కువగా స్పందిస్తుంది. బాంబులకు పిల్లలను దూరంగా ఉంచాలి. ఒక్కోసారి కాకరపూలు కూడా పేలే ప్రమాదముంది. కాబట్టి పిల్లలకు ముందుగా ప్రమాదాల గురించి చెప్పాలి. టపాసులు కాల్చేటప్పుడు, కాల్చిన తర్వాత చేతులను కళ్లలో, ముక్కులో, నోట్లో పెట్టుకోకుండా చూడాలి. అలాగే భూచక్రాలను కాల్చేటప్పుడు పాదరక్షలను ధరించడం మరచిపోవద్దు. ఆ సమయంలో పాకే పసికందులను నేలపై దించవద్దు. విడి బాంబులు లేదంటే సీరియల్‌గా ఉండే సీమటపాసులను కొంచెం దూరంగా ఉంచి కాల్చడం మంచిది. వీటిని కాల్చేటప్పుడు వచ్చిపోయే వారిని గమనించాలి. ముఖ్యంగా థౌజండ్‌వాలా, 10 థౌజండ్ వాలా సీరీస్‌ను కాల్చేటప్పుడు జనం లేకుండా చూసుకోవాలి..దీపావళి సామగ్రికి సమీపంలో కొవ్వొత్తులను, అగరువత్తులను ఉంచవద్దు. వెలిగి పేలకుండానే ఆరిపోయిన చిచ్చుబుడ్లు, బాంబుల వద్దకు వెళ్లి పరిశీలించడం, మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయడం అత్యంత ప్రమాదకరం. టపాసుల విక్రయాల దుకాణాల యజమానులు పాటించాల్సిన నిబంధనలు, 1) పర్యావరణానికి హానికరమైన టపాసులను విక్రయించరాదు. 2) బాణా సంచా దుకాణాల వద్ద అగ్నిమాపక నియంత్రణ సాధనాలను సిద్ధంగా ఉంచుకోవాలి. 3) 18 సంవత్సరాలలోపు బాల బాలికలతో బాణసంచా దుకాణాల వద్ద పని చేయించరాదు. 4) ప్రభుత్వం అనుమతి లేకుండా బాణసంచా విక్రయించరాదు. 5) బాణసంచా దుకాణాలను నిర్ధేశిత ఖాళీ ప్రదేశాలలో ఏర్పాటు చేయాలి. 6) దుకాణాల వద్ద రక్షణ చర్యలు పాటించేలాగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలి. 7) బాణసంచా దుకాణాలకు 100 మీటర్ల దూరంలో వాహనాలను నిలుపుకునే లాగ చర్యలు తీసుకోవాలి. 8) బాణసంచా దుకాణాలకు మధ్య 10 మీటర్ల స్థలం ఉండేలా చూసుకోవాలి. పై సూచనలు దుకాణదారులు పాటించవలసినదిగా పోలీసుశాఖ తెలపడమైనది.
-----------------------
Admin