సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : తెలంగాణలో మద్యం ఏరులై పారుతోందని,రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ప్రధాన ఆదాయ వనరుగా మార్చారని, విచ్చలవిడిగా గ్రామ గ్రామాన మద్యం దుకాణాల రూపంలో బెల్టు షాపులను జారీచేశారని భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో బిజెపి అభ్యర్థి అందె బాబయ్య విజయ సంకల్ప సభకు ఈటల రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈటల రాజేందర్ మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా షాద్ నగర్ కు చేరుకున్నారు. ఈటల రాజేందర్ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ జరిగింది. వేలాది మంది మహిళలు తరలివచ్చారు. దాదాపు 20 వేల మంది ప్రజలు కార్యక్రమానికి తరలిరావడంతో ఈటల సభ కిక్కిరిసిపోయింది. కమలనాధుల సమీకరణతో రోడ్లన్నీ కాషాయ మయం అయ్యాయి. బిజెపి అభ్యర్థి అందె బాబయ్య గెలుపు కోసం ఏర్పాటుచేసిన బిజేపి విజయ సంకల్ప సభ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి నామమాత్రంగా ఉన్న ఎక్సైజ్ విధానం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇబ్బడి దిబ్బడిగా లైసెన్సులను ఇస్తూ, ఊరూరా బెల్టు షాపులను ప్రోత్సహించి తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని దుయ్యబట్టారు. కొన్ని వేల కోట్ల రూపాయలు మద్యం ద్వారా ఆదాయాన్ని సేకరిస్తు ప్రజల ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నారని, అన్నారు. గ్రామాల్లో బెల్టు షాపుల వ్యవహారంతో మహిళలు పుస్తెలతాడు అమ్ముకునే స్థాయికి దిగజార్చారని తెలిపారు. బంగారు తెలంగాణ కాస్త తాగుబోతుల తెలంగాణగా మారిందని, కేవలం బార్ లైసెన్సుల ద్వారా 11వేలకోట్ల నుంచి 40 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నారని అన్నారు . దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ ఫలాలకు నిధులు మద్యం ద్వారా సేకరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఉద్యమ బిడ్డగా పాలమూరు జైల్లో గడిపా... తెలంగాణ ఉద్యమంలో 20 ఏళ్లపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట నడిచానని పాలమూరు జిల్లాలో ఉద్యమ సమయంలో ఇక్కడి జైల్లో గడిపానని ఈ ప్రాంత అనుభవాలను ఈటల రాజేందర్ నెమరు వేసుకున్నారు. తనపై నిందలు మోపి టిఆర్ఎస్ పార్టీ నుండి బయటికి పంపించారని, తాను వెళుతున్న సమయంలో తన వెంట బిజెపి అభ్యర్థి అందె బాబయ్య ఆ రోజున నా వెంట నడిచి వచ్చారని గుర్తు చేసుకున్నారు. అందె బాబయ్యకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పగా దానిని నిరాకరించి తన వెంట వచ్చారని అన్నారు. స్వయంగా సీఎం కేసీఆర్ బాబయ్యకు ఫోన్ చేసి మంచి భవిష్యత్తు ఇస్తామని ఎమ్మెల్సీ పదవి లేదా నామినేటెడ్ పోస్టు ఇస్తామని చెబితే దానిని నిరాకరించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నా జాతి బిడ్డ ఆత్మగౌరాన్ని దెబ్బతీస్తే తాను ఎలా ఆ పార్టీలో ఉంటానని బాబయ్య తో పాటు ఎంతోమంది తన వెంట నడిచారని అన్నారు. నిఖార్సుగా తన వెంట నడిచిన అందె బాబయ్య ఈ ఎన్నికల్లో పోటీలో నిలబడ్డారని ఆయనను గెలిపించుకొని జాతి గౌరవాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా అన్ని వర్గాలకు సూచించారు. బాబయ్య గెలుపు అందరికీ గెలుపని అన్నారు. అంతిమ నిర్ణయం ప్రజలదే. ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బులు సంచులు పట్టుకొని ప్రజాక్షేత్రంలో దిగబోతున్నారని వారి డబ్బులకు బీరు బిర్యానీలకు ప్రజలు అమ్ముడుపోవద్దని ఓటు అనే ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని ఈటల రాజేందర్ ప్రజలను కోరారు. ప్రజా స్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణీతలు ప్రజలేనని ఓటు అనే ఆయుధంతో మంచివారిని గెలిపించాలని కోరారు. బ్రతుకుతెరువు మారాలంటే ఓటు ద్వారా మార్చవచ్చని అది బిజెపి ద్వారా సాధ్యమవుతుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలను మరోసారి మభ్య పెట్టేందుకు వస్తున్నారని వారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదని హితవు పలికారు. అధికార పార్టీ నాయకులు పంచే వెయ్యి 2వేలకు, బిర్యానీలకు అమ్ముడు పోకూడదని హితవు పలికారు. పెద్ద కొడుకు కాదు. మేనమామ కాదు. ముఖ్యమంత్రి కెసిఆర్ మాయమాటలు నమ్మి టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దని అన్నారు. అన్ని రకాల పింఛన్లు ఇచ్చి ఇంటికి పెద్ద కొడుకు కేసీఆర్ అని ప్రచారం చేసుకుంటున్నాడని అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటి పథకాలు చేపట్టి మేనమామ అంటూ చెప్పుకుంటున్నాడని ఈ మాటలు.. ఈ గారడి వెనుక పెద్ద ఆర్థిక కుట్ర ఉందని అన్నారు. తాను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశానని గుర్తు చేశారు. ప్రభుత్వం సంవత్సరానికి ₹2,500 కోట్ల రూపాయలను వివిధ సంక్షేమ పథకాలకు కేటాయిస్తుందని వివరించారు. ఇందులో 11 వేల కోట్లు పెన్షన్లకు కేటాయించిందని వివరించారు. మద్యం ద్వారానే 45 వేల కోట్లు గడిచి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడి వేల కోట్లు ఆర్థిక సంపదను దోచుకుంటున్నారని అన్నారు. గ్రామాల్లో మద్యం బారిన పడ్డ పేద కుటుంబాలు అనేక రోగాల బారిన పడి క్యాన్సర్, లివర్ తదితర జబ్బులకు లోనై చాలా కుటుంబాలు మద్యం మహమ్మారితో కకలా వికలమవుతున్నాయని అన్నారు. బీసీలు అంటే రాహుల్ గాంధీకి చులకనా. భారతీయ జనతా పార్టీ బీసీలను గౌరవించి ముఖ్యమంత్రి పదవినీ కేటాయిస్తే రాహుల్ గాంధీ బీసీల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని అన్నారు. రాహుల్ గాంధీ అనవసరంగా కాలాయాపన చేస్తున్నాడని ఆయన వల్ల రాష్ట్రానికి లాభం జరిగేది ఏమీలేదని అన్నారు. బీసీ బిడ్డపై కుట్రలు ఎందుకు. షాద్ నగర్ అసెంబ్లీ బిజెపి అభ్యర్థి అందె బాబయ్య ప్రసంగిస్తూ.. బీసీ బిడ్డనైన తనపై కొందరు కావాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. కొంతమంది రాజకీయ పెద్దలు టికెట్ వస్తే పనిచేస్తానని చెప్పి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 40ఏళ్ల తరబడి రాజకీయ సేవలు అందిస్తే తనకు బిజెపి గుర్తింపు ఇచ్చిందని ఈ సందర్భంగా అన్నారు. తనను ఎమ్మెల్యేగా ఆదరిస్తే లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తానని అదేవిధంగా నియోజకవర్గంలో విద్య వైద్య సౌకర్యాలతో పాటు మౌలిక సదుపాయాలను సమకూర్చుతానన్నారు. ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని సమస్యలను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో ఏ నాయకుడి కల్లబొల్లి మాటలు నమ్మొద్దని ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బాబయ్య కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ టంగుటూరి విజయకుమార్, అంచె రాములు, దేపల్లి అశోక్ గౌడ్ కమ్మరి భూపాల చారి చెంది మహేందర్ రెడ్డి పాత పల్లి కృష్ణారెడ్డి కురుమయ్య చెట్ల వెంకటేష్ పేట అశోక్ వంశీకృష్ణ, శ్రీధర్ వర్మ, అందె రాజు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin