సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : 176 వ రెడ్ బుక్ డే సందర్భంగా కొత్తగూడెం టౌన్ స్టడీ సర్కిల్ కన్వీనర్ భూక్యా రమేష్ అధ్యక్షతన కమ్యూనిస్ట్ ప్రణాళిక - సమకాలీన పరిస్థితులపై స్టడీ సర్కిల్ ను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 176 సంవత్సరాల క్రితం మార్క్స్ ఎంగేజ్ కలిసి ఉమ్మడిగా రచించిన కమ్యూనిస్టు మేనిఫెస్టో (కమ్యూనిస్టు ప్రణాళిక ) అచ్చు అయ్యాక మానవాళికి అందించి కార్మిక, కర్షక వర్గానికి ఒక దిక్సూచిగా నిలిచిన మహోన్నతమైన గ్రంథం కమ్యూనిస్టు మేనిఫెస్టో అని అన్నారు. మానవ పరిణామ క్రమం లో భూమి పుట్టుక నుండి నేటి సమాజంలో జరుగుతున్న అనేక పరిణామాలను ముందుగానే శాస్త్రీయ పద్ధతిలో సోషలిస్టు వ్యవస్థను ఎలా అర్థం చేసుకోవాలో, నేటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను అధ్యయనం ఎలా చేయాలో చెప్పిన వాస్తవిక రూపం కమ్యూనిస్టు ప్రణాళిక అని ఆయన తెలిపారు. కమ్యూనిస్టు మేనిఫెస్టోను పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పౌరుడు అధ్యయనం చేయాలి అని అన్నారు. ప్రకృతిలో ఏర్పడిన అనేక మార్పులను గమనించి , తమ లాభాల కోసం బడా కార్పోరేట్లకు అనుకూలంగా మార్చుకొని పబ్బం గడుపుకుంటున్న డబ్బున్న వాళ్లకు వ్యతిరేకంగా ఎలా ముందుకు సాగాలో, అన్యాయాలకు , దోపిడీలకు, అవినీతికి, పేదరికానికి కారణాలు ఏమిటో కమ్యూనిస్టు ప్రణాళికలో వివరించబడిందన్నారు . ప్రతి సమస్యకు పరిష్కారం కావాలంటే కమ్యూనిస్టు మేనిఫెస్టోను అధ్యయనం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మానవతాదృక్పథంతో ప్రజలు అందరూ సమానంగా ఉండాలని సోషలిస్టు స్థాపన కోసం, సమసమాజ నిర్మాణం కోసం అధ్యయనం తప్పనిసరి అని అన్నారు. గత చరిత్రను అధ్యయనం చేస్తేనే భవిష్యత్తుకు బాటలు వేయగలమని అన్నారు. అందరూ విధిగా సమాజంలో వస్తున్న మార్పులను అధ్యయనం చేసి విశ్లేషణ చేసి ప్రజలకు అర్థమయ్యేలా చైతన్యం కలిగించి పోరాటాలకు సన్నద్ధం చేయాలన్నారు . మంచి సమాజం కోసం అందరం కలిసి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమం లో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, కొండపల్లి శ్రీధర్, పట్టణ నాయకులు డి.వీరన్న, నందిపాటి రమేష్, ఎలగిండ రఘు, కొత్తపల్లి రమేష్ బాబు, లింగయ్య, గడల నరసింహారావు, నాజర్, నాగ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin