సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : సైబర్ నేరగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోసాల బారిన పడి విలువైన జీవితాన్ని పోగొట్టుకోవడం లేదా జీవితానికి హానికరం కావచ్చని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ సీఐ ప్రతాప్ లింగం పలు కీలక సూచనలు జారీ చేశారు. తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తరపున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సైబర్ నేరగాళ్లు ఎలా వ్యవహరిస్తారో స్థానిక మీడియాకు వివరించారు. దీనిపై సిటీటైమ్స్ కథనం.. మనకు తెలిసిన వ్యక్తి వీడియో కాల్ చేసి డబ్బులు అడుగుతున్నారంటే కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయాలని సూచించారు. సైబర్ మోసగాళ్లు మీకు తెలిసిన ఫోటోలను, వాయిస్ ను సోషల్ మీడియా నుండి సేకరించి డీప్ ఫేక్ సాఫ్ట్వేర్ జత చేస్తారని పేర్కొన్నారు. సైబర్ మోసగాళ్లు తమ ముఖాన్ని మీకు తెలిసిన వ్యక్తి ముఖంతో జతచేసి ఆ తర్వాత అతని వాయిస్ ను సింక్ చేస్తారని వివరించారు. ఇక వీడియో కాల్ చేసి వాయిస్ అచ్చం అలాగే మాట్లాడుతూ ఆసుపత్రిలో ఉన్నామని అర్జెంటుగా డబ్బులు కావాలని నమ్మిస్తారని తెలిపారు. ఇది మనకు తెలిసిన వాళ్లే చేశారు అని మోసపోయి డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉందని చెప్పారు. ఇలాంటి డీప్ ఫేక్ ఫ్రాడ్ గురించి జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఆన్లైన్ బెట్టింగ్ గ్యాంబ్లింగ్.. ఇక సైబర్ నేరగాళ్లు మరో ఎత్తుగడలో భాగంగా ఆన్లైన్ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ చేస్తారని పేర్కొన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఎవరో చెప్పింది నమ్మి ఆన్లైన్ బెట్టింగ్ చేయొద్దని సూచనలు జారీ చేశారు. ఇలాంటి కార్యకలాపాల వల్ల డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తులు తప్ప బాగుపడ్డవారు లేరని తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా నేరగాళ్లు లాభపడతారని ప్రజలు మోసపోతారని పేర్కొన్నారు. బెట్టింగ్ లో లాభపడ్డారు అని ఒక కారణం చేత మీ అకౌంట్ హ్యాక్ చేసి బెట్టింగ్ చేసిన డబ్బులు కూడా లాగేస్తారని తెలిపారు. ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్ మోసాలకు పాల్పడి డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. వీటికి దూరంగా ఉండాలని చెప్పారు. ఫేక్ లోన్ ఫ్రాడ్.. లోన్ యాప్ లను డౌన్లోడ్ చేసి మీరు అప్పు తీసుకుంటున్నారా తస్మాత్ జాగ్రత్త అంటూ సీఐ ప్రతాప్ లింగం పేర్కొన్నారు. ఈ అప్పు మాటున అపాయం పొంచి ఉందని సీఐ ప్రతాప్ లింగం తెలిపారు. దీనివల్ల పరువు జీవితం రెండు పోవచ్చు అని అన్నారు. మీ ఫోన్లో లోన్ యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేశారంటే మీ ఫోన్లో ఉన్న మీ కాంటాక్ట్స్, లొకేషన్, ఫోటోలు మీ వ్యక్తిగత విషయాలన్నీ లోన్ ఇచ్చే వారి వద్దకు వెళ్లిపోతాయని తెలిపారు. మీరు తీసుకున్న లోన్ కట్టిన కట్టకపోయినా నరకం చూపిస్తారని వివరించారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఫోటోలను తీసుకొని వాటిని మార్ఫింగ్ చేసి కుటుంబ సభ్యులను స్నేహితులను బంధువులకు అశ్లీలంగా ఫోటోలు పంపి బ్లాక్ మెయిల్ చేస్తారని వివరించారు. ఇప్పుడు కొత్తగా సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేసి మీ పేరుపై లోన్ ఉందని కావలిస్తే ఈ లింక్ ఓపెన్ చేయండి వివరాలు చూసుకోండి అని చెబుతారని ఒకవేళ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న లేదా లింక్ ఓపెన్ చేసినా మన వివరాలన్ని వారికి వెళ్ళిపోతాయని చెప్పారు. ఆ తర్వాత మన వద్ద ఉన్న వివరాలతో మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారని ఎన్నో వేధింపులకు గురిచేసి డబ్బులు గుంజుతారని చెప్పారు. ముఖ్యంగా వాట్సాప్ ద్వారా యాప్ పంపించి డౌన్లోడ్ చేసుకోండి అని చెబుతారని వాటిని ఎట్టి పరిస్థితిలో విశ్వసించకూడదని చెప్పారు. ఎవరికైనా అనుమానాలు ఏర్పడితే లేదా ఇంకా ఏదైనా సమాచారం కోసం సైబర్ క్రైమ్ ని www.cybercrime.gov.in నందు రిపోర్ట్ చేయవచ్చని, సలహాల కోసం 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయవచ్చని సిఐ ప్రతాప్ లింగం కోరారు.
-----------------------
Admin