సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / తెలంగాణ సాధన తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలో చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శవంతంగా నిలిచాయని, మరో 15 ఏళ్ల పాటు బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణాలో అధికారంలో ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో స్ధానిక ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో వివిధ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, సహకార కోపరేటివ్ చైర్మన్ రాజా వరప్రసాద్ తదితరులు హాజరయ్యారు. అనంతరం షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బిజెపి లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలు దగ్గర పడడంతో ముసలి నాయకులు కూడా మాట్లాడడం మొదలు పెట్టారని అన్నారు. ఎన్నో ఉద్యమాలతో ప్రాణాలకు తెగించి తమ నాయకుడు కేసీఆర్ తెలంగాణను తీసుకొస్తే కాంగ్రెస్, బిజెపి నాయకులు దొంగల్లా తెలంగాణలోకి జొర బడ్డారాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని రాష్ట్రాన్ని తమ తమ పాలనలో దివాలా తీయించిన పార్టీలు ఈ రెండేనని ఆరోపించారు. బిజెపి రెచ్చగొట్టే ప్రసంగాలతో పబ్బం గడుపుతుందే తప్ప దేశానికి తాము ఏం చేశారో చెప్పడం లేదని అన్నారు. ప్రైవేటీకరణలతో ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ రాజ్యమంటే ఏమిటో మంత్రి వెటకారంగా సెలవిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు వేల పెన్షన్ 200కు పడిపోతుందని, రైతుబంధు ఎత్తేస్తారని, కరెంటు కోతలు మళ్లీ మొదలవుతాయని అన్నారు. రైతుబంధు, మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమాలు అన్ని వర్గాలకు మేలు చేస్తున్నాయన్నారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో ఎన్నో మార్పులు వచ్చాయని, గ్రామీణ ప్రాంతాలు గణనీయంగా అభివృద్ధి చెందాయని అన్నారు. బిజెపి కాంగ్రెస్ లు గెలిస్తే తిరిగి పాత రోజుల్లోకి వెళ్లి పోతామన్నారు. అంజన్న అదరహో. అంజన్న లాంటి ఎమ్మెల్యే దొరకడం మీ అదృష్టం.. 24 గంటలు మీ గురించే ఆలోచిస్తాడు.. నియోజక వర్గానికి ఏ అవసరం ఉన్న ముఖ్యమంత్రి వెంటపడి మరి సాధిస్తాడు.. అభివృద్ధి విషయంలో అంజన్న అదరహో.. అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇన్ని కోట్లు తెచ్చి ఇన్ని రకాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని తాను ఇంతవరకు చూడలేదు అన్నారు. స్థానికంగా బిజెపి కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పై అవాకులు చవాకులు పేలుతున్నారని, కానీ వాళ్లంతా మూకుమ్మడిగా యుద్ధం చేసిన అంజయ్య యాదవ్ పై గెలవలేరని అన్నారు. నేతలు కార్యకర్తలు ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేయాలని చూపించారు. అంజన్నను ఏమి పీకలేరు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓ సందర్భంలో తన వాగ్బానాలతో రెచ్చిపోయారు. అంజన్న గురించి తెలియని వారు ఎవరో కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అంజన్న ఒక్క ఫోన్ కాల్ చేస్తే నిమిషాల్లో ఆయన ఇంటి ముందు వాలుతామని అన్నారు. ఉమ్మడి జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు నాతో సహా అంజన్నకు అండగా ఉంటామని అన్నారు. అంజన్న గురించి ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన కుటుంబం గురించి మాట్లాడుతున్నారని ఎవరెన్ని కుట్రలు చేసినా అంజన్న వెంట్రుక కూడా పీకలేరు అంటూ మంత్రి సభలో రెచ్చిపోయారు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు గ్రూపు తగాదాలు కాంగ్రెస్ పార్టీలో కనిపించేవని, ఇప్పుడు తెలంగాణ వచ్చాక అందరూ ఎమ్మెల్యేలు ఏకతాటిపై ఉన్నారని మా జోలికి వస్తే తడాఖా చూపిస్తామంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రతిపక్షాలను హెచ్చరించారు. ఇవీ ప్రగతి వెలుగులు. షాద్ నగర్ పట్టణానికి చేరుకున్న మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ వాణీదేవి, జడ్పీ చైర్మన్ తీగల అనిత రెడ్డితో కలిసి ముందుగా రూ 15 కోట్లతో కేశంపేట రోడ్డు విస్తరణ కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పాత జాతీయ రహదారి విస్తరణ రెండో భాగానికి రూ. 45 కోట్లతో శంకుస్థాపన చేశారు. తరువాత అత్యాధునికంగా ముస్తాబైన పట్టణ గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. అక్కడి నుండి చటాన్ పల్లి రోడ్డుకు చేరుకొని రైల్వే ఫ్లై ఓవర్ కు రూ. 95 కోట్లతో శంకుస్థాపన చేశారు. అటు నుంచి స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించిన ప్రయాణికుల విడిది భవనాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక మండల పరిషత్ ఆవరణలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. వ్యవసాయ సహకార యూనియన్ చైర్మన్ రాజా వరప్రసాద్, పురపాలక చైర్మన్ కొందూటి నరేందర్, మాజీ ఎమ్మెల్యే భీష్మ కిష్టయ్య, ఎంపీపీలు రవీందర్ యాదవ్, ఇద్రీస్ ,జడ్పీటీసీలు వెంకట్రాంరెడ్డి, తాండ్ర విశాల, పురపాలక వైస్ చైర్మన్ ఎం.ఎస్ నటరాజన్, శ్యామసుందర్ రెడ్డి, వి .నారాయణరెడ్డి, బెంది శ్రీనివాసరెడ్డి, మార్కెట్ చైర్మన్ కవిత మన్నె నారాయణ, గ్రంథాలయ చైర్మన్ లక్ష్మీనరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
-----------------------
Admin