సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గంలో ఇల్లు సరిగ్గా లేని నిరుపేదల బ్రతుకులు క్షణక్షణం బిక్కుబిక్కుమంటూ ఉన్నాయని, వర్షాలు వస్తే పేదలు తమ ఇండ్లలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతకాల్సిన కర్మ ఏర్పడిందని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం షాద్ నగర్ ఆర్డిఓ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సమస్యల మెమొరాండం సమర్పించారు. నియోజకవర్గంలో గత వారం రోజులుగా కురుస్తున్న నిరంతర వర్షానికి పేదల ఇండ్లు కూలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించలేదని పేదల గోడు వినిపించుకోవడంలేదని విమర్శించారు. పేదలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు అధికారులు పట్టి పట్టనట్టు ఉన్నారని ఆరోపించారు. వర్షాలకు ఇల్లు కూలి పేద ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారని నిలువు నీడ లేక ఆదుకునే వారు లేక ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వీర్లపల్లి శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి సకాలంలో ఇచ్చి ఉంటే వారికి ఈరోజు ఈ తిప్పలు ఉండేవి కావని అన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో నష్టపోయిన పంటల పరిశీలన చేపట్టి క్షేత్రస్థాయిలో వివరాలను సేకరించి ప్రభుత్వానికి వెంటనే అందజేయాలని సూచించారు. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఇల్లు కూలిపోయిన పేదలను సకాలంలో ఆదుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin