సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని గ్రహించి విద్యార్థులు, యువత కష్టపడి చదివి ఉన్నత విద్యావంతులుగా తయారవ్వాలని కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల కేంద్రంతోపాటు కొత్తపేట, వేములనర్వ, నిర్దవెళ్లి గ్రామాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విద్యా దినోత్సవ వేడుకల్లో స్థానిక జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డితో కలిసి ఎంపీపీ రవీందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశాల్లో ఎంపీపీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ ధీటుగా తయారు చేస్తుందన్నారు. రాష్ట్రంలో గురుకులాలను ఏర్పాటు చేసి అణగారిన వర్గాల విద్యాభివృద్ధికోసం కృషి చేస్తున్నారన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం వంటి అనేక సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవంగల ఉపాధ్యాయుల చేత బోధన సాగుతుందని, ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. మన ఊరి మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగానే ఉన్నత పాఠశాలలను డిజిటల్ తరగతుల బోధనకోసం ఎంపిక చేయడం జరిగిందన్నారు. డిజిటల్ తరగతుల బోధనవల్ల విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. డిజిటల్ బోధన కేవలం కార్పొరేట్ పాఠశాలల్లోనే ఉందని, కానీ కేసీఆర్ ప్రభుత్వం మారుమూల పల్లెల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా డిజిటల్ తరగతులను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతోపాటు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతోపాటు యూనిఫామ్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఆజంఅలీ, ఎంపీడీఓ రవిచంద్ర కుమార్ రెడ్డి, ఎంపీఓ నరసింహులు, బీఆర్ఎస్ కేశంపేట మండల అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు నవీన్ కుమార్, వెంకట్ రెడ్డి, పార్వతమ్మ వెంకటయ్య, షాద్ నగర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణగౌడ్, ఉప సర్పంచ్ గంజాయి దశరథం, నక్క గోపాల్, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin