సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : ఉపాధి కోసం ఆఫ్రికాలోని మాలి దేశానికి వెళ్లిన యాదాద్రి భువనగిరి జిల్లా యువకుడు ప్రవీణ్ ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్నాడు. గత నెల 23న విధులు ముగించుకుని వస్తుండగా JNIM ఉగ్రవాద సంస్థకు చెందిన దుండగులు కిడ్నాప్ చేశారు. దీంతో అతడి తల్లిదండ్రులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భారత ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.... యాదాద్రి భువనగిరి జిల్లా బండసోమారం గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడిని ఆఫ్రికాలో ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర ఆందోళనను సృష్టించింది. తమ బిడ్డ ఎలా ఉన్నాడోనని తల్లి మహేశ్వరి, తండ్రి జంగయ్య తల్లడిల్లుతున్నారు.వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నల్లమాస జంగయ్య, మహేశ్వరి దంపతుల రెండో కుమారుడు ప్రవీణ్ ఉపాధి కోసం గతేడాది నవంబరులో ఒక బోర్‌వెల్ కంపెనీ తరఫున ఆఫ్రికాలోని మాలి దేశంలోని కోబ్రి ప్రాంతానికి వెళ్లారు. ఎంత పనిలో ఉన్నా.. ప్రవీణ్ ప్రతిరోజూ ఉదయం 9 గంటల సమయంలో తప్పనిసరిగా తల్లిదండ్రులతో మాట్లాడేవాడు. అయితే గత నెల 22న చివరిసారిగా ఇంటికి కాల్ చేసిన ప్రవీణ్.. మరుసటి రోజు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.ప్రవీణ్ కిడ్నాప్ అయిన విషయాన్ని బోర్‌వెల్ కంపెనీ ప్రతినిధులు డిసెంబర్ 4 అతని తల్లిదండ్రులకు ఫోన్ చేసి ధ్రువీకరించారు. గత నెల 23న ప్రవీణ్ విధులు ముగించుకుని తాను ఉంటున్న గది వద్దకు వెళ్తుండగా.. జేఎన్‌ఐఎం (JNIM) అనే ఉగ్రవాద సంస్థకు చెందిన దుండగులు అతడిని కిడ్నాప్ చేశారని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అంతకుముందు కూడా అదే ప్రాంతంలో ఆ సంస్థ కొంతమంది విదేశీయులను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. ఈ ఘటన గురించి తెలుసుకున్న బండసోమారం గ్రామ ప్రజలు, ప్రవీణ్ కుటుంబ సభ్యులకు కన్నీటి పర్యంతమవుతున్నారు. అతని క్షేమం గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారు.ప్రస్తుతం ప్రవీణ్ ఆచూకీ కోసం బోర్‌వెల్ కంపెనీ ప్రతినిధులు ఢిల్లీలోని భారత రాయబార కార్యాలయం అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రవీణ్‌ను సురక్షితంగా విడిపించేందుకు భారత ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ విజ్ఞప్తి చేస్తున్నారు. విదేశీ గడ్డపై ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న తమ బిడ్డను త్వరగా స్వదేశానికి తీసుకురావాలని వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. మాలిలో ఉగ్రవాదం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. ప్రవీణ్ త్వరగా క్షేమంగా తిరిగి వస్తాడనే ఆశతో బండసోమారం గ్రామం మొత్తం ఎదురుచూస్తోంది....
-----------------------
Admin