సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : మేడారంలోని సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులు హెలికాప్టర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో తంబి సంస్థవారు హెలికాప్టర్ సేవలను సద్వినియోగం చేసుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అమ్మవార్లను సత్వరమే దర్శనం చేసుకోవడానికి సమయం వృధా కాకుండా హెలికాప్టర్ సేవలను రాష్ట్ర పర్యాటక శాఖ చేపట్టిందని, హనుమకొండ జిల్లా కేంద్రం నుండి మేడారం వరకు తిరిగి మేడారం నుండి హనుమకొండ కు వెళ్లేందుకు అతి తక్కువ ధరలలో ఒక్కొక్కరికి 31 వేల రూపాయల టికెట్ నిర్ణయించిందని, అంతేకాకుండా మేడారం పరిసర ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా పర్యటించడానికి 4 వేల 8 వందల రూపాయల టికెట్ ను ఖరారు చేశారని వివరించారు. గతంలో మహా జాతర సందర్భంగా అప్పటి పాలకులు నామమాత్రంగా నిధులు కేటాయించగా నేడు రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం గద్దెల పునరుద్ధరణ పనులతో పాటు అభివృద్ధి కార్యక్రమాల కోసం 2 వందల 51 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని అన్నారు. నేటి నుండి ఈ నెల 31 వరకు వీరి సేవలు కొనసాగుతాయని తెలిపారు. థంబి ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ సర్వీస్ నిర్వహిస్తుంది.బుకింగ్ వివరాలు: ఫోన్: 9676320139, 8530004309, 7660939509 వెబ్‌సైట్: www.helitaxii.com
-----------------------
Reporter