సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. టిఆర్ఎస్ పార్టీకి చెందిన నందిగామ మహిళా ఎంపీపీ ప్రియాంక కొత్తూరు ఉమ్మడి మండలాల మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ దంపతులు ఇద్దరు కాసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎలాంటి హడావిడి లేకుండా షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి చర్చలతో వారు పార్టీలోకి వచ్చారు. మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ ఆయన సతీమణి ప్రియాంక ఇరువురితో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి, సీనియర్ నేత కాశీనాథ్ రెడ్డి, కొత్తూరు మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, మైనార్టీ నాయకుడు జమృధ్ ఖాన్ తదితరులు గురువారం శంషాబాద్ లోని శివశంకర్ గౌడ్ గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి వారితో చర్చలు జరిపారు. భవిష్యత్ రాజకీయ ప్రణాళికలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే విధంగా చర్చలు సఫలం అయ్యాయి. దీంతో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి వారికి వెంటనే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా శివశంకర్ గౌడ్ దంపతులు కాంగ్రెస్ పార్టీలోకి రావడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుండి ఇద్దరు జెడ్పిటిసి కాంగ్రెస్ లో చేరగా తాజా పరిణామంతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అయింది.
-----------------------
Admin