సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / శాంతి భద్రతలు ఎక్కడ ఉంటే అభివృద్ధి అక్కడే వేగవంతంగా ఉంటుందని శాంతి భద్రతల రక్షణకు తెలంగాణ రాష్ట్రం పెట్టింది పేరని అందులో హైదరాబాద్ ఒక బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకుందని శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి ఐపీఎస్ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్ లో జరిగిన పోలీసు శాఖ సురక్ష దినోత్సవం సందర్భంగా స్థానిక ఏసిపి సిహెచ్ కుశాల్కర్ ఆధ్వర్యంలో పట్టణ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ తదితర డివిజన్ పోలీస్ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సురక్ష దినోత్సవ కార్యక్రమానికి డిసిపి నారాయణరెడ్డి ఐపీఎస్, శంషాబాద్ ఏసిపి భాస్కర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిసిపి నారాయణరెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధి ఉద్యమంలా కొనసాగుతుందని అన్నారు. దేశంలో తలసరి ఆదాయం ఉన్న మొదటి రెండు రాష్ట్రాల్లో రెండవ స్థానాన్ని తెలంగాణ ఆక్రమించిందని అన్నారు. ఒక ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే శాంతిభద్రతలు ఎంతో ముఖ్యమని అన్నారు. శాంతిభద్రతలకు తలమానికంగా తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే నెంబర్ వన్ స్థాయిలో ఉందని అన్నారు. అందులో హైదరాబాద్ ఒక బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకుందని ఆయన అన్నారు. మహిళలు నేడు అర్ధరాత్రి పూట కూడా సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారంటే శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సాంకేతిక పరంగా పోలీసు శాఖ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. రాష్ట్రంలో 66% సీసీ కెమెరాలు ఉన్నాయని ఇది గొప్ప పరిణామంగా ఆయన అభివర్ణించారు. 10 లక్షల సీసీ కెమెరాలు లక్ష్యాన్ని చేదిస్తూ 11 నుండి 12 లక్షల వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో చలాన్ల సంస్కృతిని కొంతమంది విభేదించినప్పటికీ అది మన మంచి కోసమనే విషయాన్ని గ్రహించాలని అన్నారు. హెల్మెట్ లేకుండా ప్రతి సంవత్సరం లక్షన్నర మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతున్నారని ఆయన అన్నారు. అందుకోసమే ట్రాఫిక్ పోలీసులు బాధ్యతాయుతంగా ప్రజలను సంరక్షించడానికి ఆ చలాన్లు వేస్తున్నారని, అది కూడా ప్రభుత్వ ఖజానాకే వెళ్తాయని ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కరలేదని అన్నారు. పోలీసు వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయని ఒకనాడు చేతుల్లో లాటిలు, ఆయుధాలు పట్టుకున్న చేతులతో ఈరోజు లాప్ ట్యాబ్ లు పట్టుకొని సాంకేతిక మార్పులతో నాణ్యమైన సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారని, ఫ్రెండ్లీ పోలీసింగ్ ముఖ్యభాగమై పోయిందన్నారు. డయల్ 100 ద్వారా ఎప్పటికప్పుడు పోలీసులు వేగవంతమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. పోలీసు శాఖ అన్న తర్వాత ఇద్దరు వ్యక్తులు న్యాయం కోసం వచ్చినప్పుడు న్యాయం ఎవరికొ ఒక వైపు ఉంటుందని అప్పుడు ఒకవైపే న్యాయము చేయడం జరుగుతుందని మరోవైపు పోలీసులపై ద్వేషం పెరుగుతుందని అలా పోలీస్ శాఖ పై కొంతమందికి ద్వేషం ఉండవచ్చని ఈ సందర్భంగా వివరించారు. ఏది ఏమైనప్పటికీ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణలో వేగవంతమైన అభివృద్ధి జరగడానికి శాంతిభద్రతల రక్షణ కారణమని అన్నారు. శాంతిభద్రతలు సజావుగా ఉంటేనే పెట్టుబడిదారులు కంపెనీలు నెలకొల్పుతారని తద్వారా ఉపాధి అవకాశాలు ఆర్థిక సంపద మెరుగు పడుతుందని ఆయన అన్నారు. అన్నిటికి మూలం శాంతి భద్రతలే అని ఆయన చెప్పారు. కార్మిక నేత పినపాక ప్రభాకర్ మాట్లాడుతూ.. పోలీసు అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అదేవిధంగా పోలీసు లేని సమాజాన్ని ఊహించలేమని అన్నారు. జెడ్పిటిసి వెంకటరామరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పోలీసులు తమకు ఎంతో సహకరించారని అన్నారు. నేడు దశాబ్ది ఉత్సవాలు వారితో జరుపుకుంటున్న అందుకు ఆనందంగా ఉందని అన్నారు. మున్సిపల్ చైర్మన్ నరేందర్ మాట్లాడుతూ.. పోలీసు శాఖ ఉన్నతికి తమ వంతు సహకారం ఎల్లవేళలా అందిస్తున్నామని సీసీ కెమెరాలు కోసం తన వంతు సాయం మున్సిపాలిటీ ద్వారా అందజేయడం జరిగిందని అన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ.. పోలీసు సేవలు సమాజంలో ఎంతో గొప్ప వని ఒకనాడు పోలీసులను చూస్తే అందరూ భయపడేవారని కానీ నేడు పోలీసులతో ఫ్రెండ్లీగా ఉంటూ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజన్ మాట్లాడుతూ.. ఒకప్పుడు పోలీసులతో ఎక్కువ దోస్తాన ఉండొద్దని వారితో దూరంగా ఉండాలని అనేవారని మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు పోలీసులతో ఫ్రెండ్లీగా ఉంటూ శాంతిభద్రత రక్షణకు ఇరువర్గాలు కృషి చేస్తుండడం ఎంతో గొప్ప మార్పుని ఆ మార్పుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాంది పలికారని కొనియాడారు. యువ నాయకుడు మహమ్మద్ ఎజాజ్ (అడ్డు) మాట్లాడుతూ.. పోలీసు సేవలు మరువలేనివని తెలంగాణ వస్తదా అనే అనుమానం నుండి నేటి దశాబ్ది ఉత్సవాల వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నవశకాన్ని ఆరంభించడం గొప్ప విషయం అని కొనియాడారు. సమాజంలో పోలీసు పాత్ర మరువలేనిదని పోలీసులకు ఎల్లవేళల యువత సహకారం అందిస్తుందని అన్నారు. కాంగ్రెస్ నేత సుధీర్ మాట్లాడుతూ.. నాటికి నేటికి సమాజంలో పోలీసులు చేపడుతున్న శాంతిభద్రతల సంరక్షణ ఎంతో గొప్పదని కీర్తించారు. పోలీసులకు తమ సహకారం ఉంటుందని అన్నారు. సుష్మా రెడ్డి మాట్లాడుతూ మహిళలకు షీ టీం ద్వారా ఎంతో రక్షణ కల్పిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి సిఐ నవీన్ కుమార్ అధ్యక్షత వహించారు. పోలీసు సేవల పట్ల ప్రసంగించిన అతిధులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎల్లవేళల పోలీసులు ప్రజలకు అండగా ఉంటారని ప్రజల సహాయ సహకారాలు ఈ వృత్తిలో మరువలేనివని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు మీడియా ప్రతినిధులకు ప్రజా ప్రతినిధులకు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సిఐలు నవీన్ కుమార్, బాలరాజు, సత్యనారాయణ, శంషాబాద్ రూరల్ సీఐ శ్రీధర్, ఎస్సైలు విజయ్, దేవిక, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం, సీనియర్ నేత యుగంధర్ కౌన్సిలర్ ప్రతాప్ రెడ్డి, నక్కల వెంకటేష్ గౌడ్, కిశోర్, జూపల్లి శంకర్, బచ్చలి నరసింహులు, సర్పంచ్ పల్లె శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin