సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మిడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాలు వచ్చి 24 గంటలు కూడా గడవక ముందే ఆరుగురు విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షల్లో తాము ఫెయిలయ్యామన్న మనస్తాపంతో మంగళవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నలుగురు విద్యార్థులు బలవన్మరణాని కి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవంతినగర్ తోటలో నివాసముంటున్న ప్రైవేట్ ఉద్యోగి సత్యనారాయణ కుమారుడు ప్రశాంత్ (17) బల్కంపేటలోని 9 ఎడ్యుకేషన్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. బుధవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఓ సబ్జెక్టులో ఫెయిలైనట్టు రావడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరోవైపు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఘనశ్యాందాస్‌నగర్ (జీడీనగర్) గ్రామానికి చెందిన సాపల్ల ఎల్లయ్య, గంగమ్మ దంపతుల కుమార్తె శశిరేఖ (17) అనే విద్యార్ధిని, భువనగిరి మండలం బస్వాపురం గ్రామానికి చెందిన రాసాల మల్లేశ్, సునీత దంపతుల చిన్నకుమారుడు అఖిలేష్ యాదవ్ (17) అనే మరో విద్యార్ధి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక్క పరీక్ష మాత్రమే జీవితం అనుకుని అర్ధాంతరంగా ప్రాణాలొదిలారు ఈ యువకిరణాలు. ఫెయిల్ అయితే మళ్లీ సప్లిమెంటరీ పరీక్షలు రాయొచ్చు. చదువే ఇష్టం లేకపోతే నచ్చినపని చేస్తూ బతకొచ్చు. అంతేగానీ లేనిపోని భయాలతో ఇలా ప్రాణాలొదిలి మీపైనే ప్రాణాలు పెట్టుకున్న కన్నోళ్లకు కడుపుకోత మిగల్చడం న్యాయం కాదు. ఓసారి ఆలోచించండి...
-----------------------
Admin