సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : భూ వివాదం పేరుతో చట్టనికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించిన 11 మంది అరెస్టు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో భూ వివాదం నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు సృష్టించిన 11 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.నానక్‌రామ్‌గూడ ప్రాంతంలోని ఓ స్థలంలో భూ వివాదానికి సంబంధించి 10 నుంచి 15 మంది వ్యక్తులు చట్టవ్యతిరేకంగా గుమికూడి స్థానిక ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, 11-15 మంది వ్యక్తులు చట్టవ్యతిరేక సమావేశంగా ఏర్పడి దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ ప్రజా శాంతికి భంగం కలిగిస్తున్నట్లు గుర్తించారు. అక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించగా, వారు సరైన సమాధానం ఇవ్వకుండా పోలీసుల విధుల నిర్వహణకు ఆటంకం కలిగించారు. దీంతో పోలీసులు తక్షణ చర్యగా వారిని అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వివరాలోకి వెళితే.నానక్‌రామ్‌గూడ పరిధిలోని జనచైతన్య కంపెనీకి సంబంధించిన భూ వివాదం నేపథ్యంలో ఆ కంపెనీలో పనిచేసే శివప్రసాద్, శ్రీకాంత్ గౌడ్‌లు భూ వివాదాన్ని సెటిల్ చేసేందుకు కొంతమందిని అక్కడికి పిలిపించినట్లు వెల్లడైంది. అదుపులోకి తీసుకున్న వారిలో హర్విందర్ సింగ్, సూర్జీత్ సింగ్, మేరాజ్, జగదీష్ సింగ్, హరిప్రీత్ సింగ్, సిమ్రంజిత్ సింగ్, ఉపేందర్ సింగ్, చరణ్ సింగ్, బల్వేందర్ సింగ్, మన్మీత్ సింగ్ తదితరులు ఉన్నారు. వీరిలో నలుగురు నిందితులపై గతంలో కూడా క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు విచారణలో తేలింది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం, చట్టవ్యతిరేక సమావేశం నిర్వహించడం, ప్రజా శాంతికి భంగం కలిగించడం, అలాగే పోలీసుల విధుల నిర్వహణకు ఆటంకం కలిగించినందుకు నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 189, 132, 270 కింద కేసు నమోదు చేసి న్యాయస్థానానికి తరలించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి డీసీపీ శ్రీ సీహెచ్. శ్రీనివాస్, ఐపీఎస్. మాట్లాడుతూ, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలు, చట్టవ్యతిరేక సమావేశాలు, ప్రజల్లో భయాందోళనలు సృష్టించే చర్యలను సైబరాబాద్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోరని హెచ్చరించారు. భూ వివాదాలు లేదా ఇతర ఆస్తి సంబంధిత సమస్యలను చట్టబద్ధమైన మార్గాల్లోనే పరిష్కరించుకోవాలని సూచించారు. భూ వివాదాల పేరుతో బలప్రయోగం, బెదిరింపులు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
-----------------------
Reporter