సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి : పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైనటువంటి అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాలు అక్రమార్కులు యదేచ్చగా నిర్మిస్తున్నారు. అలా నిర్మించడానికి అధికారులు సైతం ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. అన్నపురెడ్డిపల్లి ప్రాంతం పూర్తిగా1/70 యాక్ట్ లోకి వస్తున్న సరే కింది స్థాయి నుండి ఉన్నతాధికారుల వరకు పూర్తిగా నిద్ర నటిస్తూ కళ్ళముందు బహుళ అంతస్తులు భవనాలు నిర్మిస్తున్నాసరే పట్టించుకోకపోవడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే మండల కేంద్రమైన అన్నపురెడ్డిపల్లి లో గడిచిన కొంతకాలంగా నాలుగు అంతస్తుల భవనాన్ని యదేచ్చగా గ్రామపంచాయతీ నుండి కనీసం ఎటువంటి నామమాత్రపు అనుమతులు కూడా లేకుండా అక్రమ నిర్మాణం చేపడుతున్నారు. ఈ తతంగం అంతా ప్రధాన కూడలిలో బహిరంగంగా జరుగుతున్న అదే విధంగా అక్రమార్కులు నాలుగవంతస్తుకి సోమవారం స్లాబ్ పోస్తున్న ఈ విషయాన్ని గ్రామపంచాయతీ అధికారులకు కిందిస్థాయి నుండి ఉన్నత స్థాయి అధికారులు వరకు ఫిర్యాదు చేసిన సరే కనీసం భవన నిర్మాణం వైపు చూడకపోవడం పట్ల సర్వత్ర తీవ్ర విమర్శలు ప్రజలనుంచి వినిపిస్తున్నాయి. వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అమలులో ఉన్న ప్రాంతం కావడంతో ఇక్కడ 2 అంతస్తులు నిర్మించుకోవడానికి కూడా స్థానికులకు అవకాశం లేదు. కానీ అక్రమార్కులు ఇక్కడ ఏకంగా గ్రౌండ్ లెవెల్ నుండి నాలుగు అంతస్తులు నిర్మిస్తున్న సరే అధికారులు చోద్యం చూస్తుండటం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామపంచాయతీ అధికారులకు అక్రమార్కుల నుండి భారీ స్థాయిలో ముడుపులు అందటం వల్లనే ఈ బహిరంగ అక్రమంపై ఎవరు నోరు మెదపడం లేదని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీలో బహుళ అంతస్తులు భవనాల నిర్మాణం పూర్తిగా విరుద్ధమని పాలు తాగే పిల్లవాడికి కూడా తెలుసు కానీ ఇక్కడ చట్టాలు పూర్తిగా తెలిసిన అధికారులు కు ఈ విషయాలన్నీ తెలిసినా సరే పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏజెన్సీలో నిర్మాణాలకు తప్పనిసరిగా పీసా గ్రామసభ ఆమోదం తో పాటుగా గ్రామపంచాయతీ నుండి పూర్తిస్థాయి అనుమతులు కలిగి ఉండాలి. ఇవి కూడా గ్రౌండ్ లెవెల్ నుండి ఒక అంతస్తు వరకే అవకాశం ఉంది. అది కూడా వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ కి లోపల భూములు కలిగి ఉన్నవారు మాత్రమే ఇక్కడ శాశ్వత నిర్మాణాలను చేపట్టుకునే అవకాశం ఉంది. కానీ ఈ నిబంధనలేవి తమకు పట్టవు అన్నట్లుగా అక్రమార్కులు వ్యవహరిస్తూ మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు నిరంతరం తిరిగే ప్రధాన కూడలిలో బహుళ అంతస్తుల భవనాలు దర్జాగా నిర్మిస్తున్నారంటే దీని వెనకాల భారీ స్థాయిలో నగదు చేతులు మారినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అక్రమ నిర్మాణం జరుగుతుందని పలుమార్లు స్థానిక అధికారులకు, సిబ్బందికి విన్నవించిన సరే కనీసం పంచాయతీ సిబ్బంది గాని కార్యదర్శి గాని ఎంపీ ఓ గాని ఎంపీడీవో గాని ఇతర బాధ్యతాయుతమైన అధికారులు ఎవరూ కూడా బహుళ అంతస్తు భవనం వద్దకు వచ్చిన దాఖలాలు కనపడకపోవడం తీవ్ర చర్చనియాంశం అయింది. సదరు అక్రమార్కుడికి రాజకీయంగా అండదండలు పుష్కలంగా ఉండటం వలన అధికారులు వెనుకడుగు వేస్తున్నారని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరైన పద్ధతి కాదని మండలంలోని పలువురు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. నిబంధన లను తోసిరాజని అక్రమార్కులకు అధికారులు వత్తాసు పలకడం ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నిస్తున్నారు. గ్రామపంచాయతీ అధికారులు సదరు భవన నిర్మాణదారుడికి పలుమార్లు ఫోన్ చేస్తే మాకు అన్ని అనుమతులు ఉన్నాయండి మేము మీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదని పేర్కొనటం గమనార్హం. ఇదే విషయమై మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లను పంచాయతీ కార్యాలయానికి తీసుకుని రండి అని పంచాయతీ కార్యదర్శి పలుమార్లు నిర్మాణదారుడు కి ఫోన్ చేసినా సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు అర్థగంట ఆగి వస్తాను గంటకి వస్తాను అని బదులిచ్చారు కానీ ఎటువంటి కాగితాలను వారు అధికారులకు చూపించకపోవడం పై పలు అనుమానాలకు తావిస్తుంది. ఏజెన్సీలో పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా బహుళ అంతస్తులు భవనం నిర్మిస్తున్న నిర్మాణదారుడుపై జిల్లా పంచాయతీ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోలు జోక్యం చేసుకుని తక్షణమే భవన నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని మండల ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
-----------------------
Admin