సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : జిల్లాలో వివిధ జాతీయ రహదారులకు, బెంగళూరు - మైదుకూరు - అమరావతి- విజయవాడ ఆరు లైన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ చేతన్ ఆదేశించారు. బుధవారం పుట్టపర్తి కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో వివిధ జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియపై ఆర్డీఓలు, తహసీల్దార్ లతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న వివిధ జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ చాలా ప్రధాన అంశమన్నారు. అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆయా ప్రాజెక్ట్లకు సంబంధించి సకాలంలో భూసేకరణను చేపట్టాలని, ఇందుకోసం ఆయా శాఖల అధికారులు అన్ని విధాల చర్యలు తీసుకోవాలన్నారు. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే, కొడికొండ చెక్ పోస్టు - హిందూపురం 544 రహదారి, ఎన్ హెచ్ 44, ఇతర రహదారులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్క ప్రాజెక్టును సకాలంలో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వారం రోజులలోగా 3జీ, అలాగే నేషనల్ హైవే 342 పనులను పూర్తి చేసి సంబంధించిన ప్రతిపాదనలను మూడు నాలుగు రోజుల్లోగా సమర్పించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో పెనుకొండ సబ్ కలెక్టర్ కే.కార్తీక్ , పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ, ధర్మవరం ఆర్డీవో తిప్పే నాయక్, కదిరి ఆర్డిఓ రాఘవేంద్ర, ఎక్స్ప్రెస్ హైవే ఏఈ రామకృష్ణ, ఎన్ హెచ్ హైవే ఏఈ గిడ్డయ్య, ఆయా మండలాల తహసీల్దార్ లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ రియాజ్, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin