సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ధర్మవరం 2వ పట్టణ సీఐ రాజా తీరుపై నియోజకవర్గ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కేసు విషయంలో సీఐ పిలుస్తున్నారంటూ ధర్మవరం 37వ వార్డ్ రామ్ నగర్‌కు చెందిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు హరీష్, మంజు, చంద్రశేఖర్, వెంకటేష్, సూరి, వెంకటరాముడులను సీఐ రాజా విచక్షణారహితంగా చితకబాదాడు. పరిటాల శ్రీరామ్ ను ఎందుకు కలిశారంటూ సీఐ తమను చితకబాదారంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ చేతుల్లో గాయపడ్డ ఒక టీడీపీ కార్యకర్తకు చేయి విరిగింది. విషయం తెలుసుకున్న శ్రీరామ్ శుక్రవారం ధర్మవరం వెళ్లారు. బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. అసలు స్టేషన్ కు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.. సీఐ ఎందుకు కొట్టారని ఆరా తీశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ సీఐ రాజా తీరు మొదటి నుంచి ఇలానే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చెన్నేకొత్తపల్లిలో పని చేసిన సమయంలో ఒక చిన్న కేసులో కూడా కొందరు అమాయకుల పట్ల ఇలానే వ్యవహరించారని గుర్తు చేశారు. అప్పట్లో పోస్టింగ్ విషయంలో తమ వద్దకు వచ్చారని.. మేము ఆయనకు సహకరించని విషయం మనసులో పెట్టుకున్నారన్నారు. అందుకే కేసుల విషయంలో రాజీ అంటూ స్టేషన్ కు పిలిపించి ఇలా చితకబాదారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ రాజాకు కోపం ఉంటే నన్ను కొట్టాలని అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూసే వారన్నారు. ధర్మవరంలో సెటిల్మెంట్లు, భూదందాలు చేస్తున్న వారి పట్ల ఇలా వ్యవహరిస్తే బాగుంటుందని శ్రీరామ్ హితవు పలికారు. వైసీపీ కార్యకర్తల కంటే ఎక్కువగా ఆ పార్టీ కోసం పని చేస్తున్నారని.. ఖాకీ చొక్కా తీసేసి వైసీపీ కండువా కప్పుకోవాలని సూచించారు. చట్టాన్ని అతిక్రమించి అమాయకులను విచక్షణా రహితంగా కొట్టారని దీనిపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసు అధికారులు దీనిపై చర్యలు తీసుకోని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు....
-----------------------
Admin