సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ జెడ్పిటిసి, ఎంపిటిసి మరియు సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ను పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కడ్బందిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఎన్నికల నిర్వహణ కొరకు నియమించిన జోనల్ అధికారులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లు (SST) లతో కలెక్టర్ సమావేశమైనారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల మేరకు అంకుంఠిత దీక్షతో, చట్టబద్ధంగా, చురుకైన ధోరణితో సిబ్బంది పనిచేయాల్సిన అవసరముందని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నియమావళిని, నిబంధనలను ఆకలింపు చేసుకొని సంబంధిత విషయాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. జోనల్ అధికారులు వారి పరిధిలో పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలను వెంటనే సందర్శించి ఫర్నిచర్ టాయిలెట్, లైటింగ్, వెబ్ కాస్టింగ్ తదితర కనీస సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలని, అదేవిధంగా రూట్ మ్యాపింగ్ చేసుకోవాలని, జోనల్ అధికారులు రిటర్నింగ్ అధికారుల సమన్వయంతో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి నివేదించాలన్నారు. పోలింగ్ సిబ్బందిని సురక్షితంగా పోలింగ్ తేదీకి ఒకరోజు ముందు సాయంత్రం ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఉండేటట్లు చూస్తూ పోలింగ్ పూర్తయిన తదుపరి మెన్ అండ్ మెటీరియల్ రిసెప్షన్ సెంటర్లో సురక్షితంగా చేర్చే బాధ్యత జోనల్ అధికారులపై ఉందన్నారు. జిల్లాలోని వర్ధన్నపేట మండలంలోని శివరాంపూర్ వద్ద, పర్వతగిరి మండలంలోని చింత నెక్కొండ వద్ద, జాన్ పీరీలు తదితర ఐదు సరిహద్దు ప్రాంతాల్లో స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్లను ఏర్పాటు చేసినట్లు, అదేవిధంగా ప్రతి మండలానికి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీ, మద్యం పంపిణీ, బెదిరింపులు, అక్రమ ప్రచారాలు వంటి ఉల్లంఘనలపై ఈ బృందాలు నిరంతరం నిఘా పెట్టి, తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతిరోజు నివేదికలు సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. ప్రజలు భయభ్రాంతులు లేకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించడం ప్రధాన బాధ్యత అని కలెక్టర్ గుర్తుచేశారు. ఎన్నికల విధుల్లో సడలింపు ఏమాత్రం సహించబోమని, నియమావళిని అమలులో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అన్ని శాఖలు సమన్వయం చేసుకొని జిల్లాలో ఎన్నికలు స్వచ్ఛంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా. సత్య శారద స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిపిఓ కల్పన, డిబిసిడిఓ పుష్పాలత, డిప్యూటీ సీఈఓ వాసుమతి, జోనల్ అధికారులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వైలెన్స్, విఎస్టీ తదితర బృంద సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter